ఆరంభం
• 1956 లో దక్షిణభారత దేశంలో జననం.
• బాల్యం నుండే లోతైన ధ్యానం, ఆధ్యాత్మిక చింతన. నాలుగేళ్ళ వయసులోనే భగవద్గీత పూర్తిగా పఠించి ఉపాధ్యాయులను ఆశ్చర్య చకితులను చేశారు.
• మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితుడైన పండిట్ సుధాకర్ చతుర్వేది వద్ద మొదటి పాఠాలు.
• 17 సంవత్సరాల నాటికి వేదసాహిత్యం సమగ్ర అధ్యయనం, దానితోబాటే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పట్టా.
శ్రీశ్రీ గురించి క్లుప్తంగా
ఆధ్యాత్మిక, మానవసేవా రంగాలలో విశ్వవ్యాప్తంగా కొనియాడబడుతున్న గురువు పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్. నేడు సర్వత్రా లోపిస్తున్న మానవతావిలువలను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా హింస, మానసికఒత్తిడి లేని సమాజాన్ని సృష్టించాలన్న శ్రీశ్రీ దృక్పథం ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని ఆకర్షించి, ప్రపంచ అభ్యున్నతికి పనిచేసే దిశగా వారి బాధ్యతను మరింత పెంచింది.
సంఘర్షణల నివారణ, ప్రకృతిఉత్పాతాలలో ప్రజలకు అండగానిలవటం, పేదరికాన్ని నిర్మూలించటం, మహిళా స్వయంసమృద్ధి, ఖైదీలలో మానసికపరివర్తన, పునరావాసం, అందరికీ విద్య; లింగవివక్ష, భ్రూణహత్య, బాలకార్మికవ్యవస్థ లకు వ్యతిరేకంగా ప్రచారం - ఇలా బహుముఖంగా విస్తరించిన కార్యక్రమాలకు సూత్రధారి, సిసలైన సామాజికకార్యకర్త శ్రీశ్రీ. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు తలెత్తిన అనేక ప్రాంతాలలో వీరు శాంతిచర్చలలో పాల్గొన్నారు. శ్రీలంక, ఇరాక్, ఐవరీకోస్ట్, కామెరూన్, మనదేశంలోని కాశ్మీర్, బీహార్ ప్రాంతాలలో, విద్వేషాలకు లోనైన ఉభయ పక్షాలనూ శాంతిచర్చలకు ఒప్పించి, ఒక చోటకు చేర్చటంలో వీరి పాత్ర పలువురి ప్రశంసలను చూరగొంది.
1981వ సంవత్సరంలో శ్రీశ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించారు. ఇది విద్య, మానవసేవా రంగాలలో 152కు దేశాలలో పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఐక్యరాజ్య సమితిలోని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లో ప్రత్యేక సలహా, సంప్రదింపుల సంస్థగా గుర్తింపబడింది. వ్యక్తులలో, సమాజంలో, దేశాలమధ్యా తలెత్తే సంఘర్షణల నివారణకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనటం, వాటిని ఆచరింప జేయటం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. 1997వ సంవత్సరంలో అంతర్జాతీయ మానవతావిలువల సంస్థ (International Association for Human Values)ను శ్రీశ్రీ స్థాపించారు. ప్రజలలో మానవతావిలువలను తిరిగి పాదుగొల్పటం, స్వయంసమృద్ధ, స్వయంచాలిత అభివృద్ధి పథకాలను అమలుచేయటం దీని లక్ష్యాలు.
ప్రజలను స్వయంగాకలవటం, బహిరంగ కార్యక్రమాలు, బోధనలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలు, మానవసేవా కార్యకమాలద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 37కోట్లమంది ప్రజలకు శ్రీశ్రీ చేరువయ్యారు. మహాత్మాగాంధీ తరువాత భిన్న ఆచారవ్యవహారాలు, మతాలు, దృక్పథాలు కలిగిన సువిశాల భారతదేశప్రజలను ఆథ్యాత్మికంగా సమైక్యం చేయగలిగిన వ్యక్తి శ్రీశ్రీ తప్ప మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
తరతరాలుగా ప్రత్యేకవర్గాలకు మాత్రమే పరిమిత మైన ప్రాచీన విజ్ఞానాన్ని శ్రీశ్రీ సామాన్యులకు అందుబాటు లోకి తెచ్చారు. అంతేకాక, నిత్యజీవితంలో సులభంగా ఆచరించగలిగే, సులభమైన వ్యక్తిత్వవికాసపద్ధతులను రూపొందించారు. ఈ పద్ధతులు దైనందినజీవితంలోని ఒత్తిడులను తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచటం ద్వారా వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి. కొన్ని వేలమంది ప్రజలకు ఆత్మన్యూనతాభావాలను, తీవ్ర భావావేశాలను, ఆత్మహత్యాఆలోచనలను తొలగించటంలో ఇవి తోడ్పడ్డాయి. శ్రీశ్రీ సృజించిన ఈ ప్రక్రియలలో సుదర్శన క్రియ అత్యంత ముఖ్యమైనది. శ్వాసక్రియను అదుపులోకి తేవటం ద్వారా మానవుని భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి, భావావేశాన్ని అదుపుచేసి, తద్వారా సామాజిక ప్రశాంతతకు ఇది తోడ్పడుతుంది.
శ్రీశ్రీ రవిశంకర్ ను అనేక అవార్డులు వరించాయి. వాటిలో చెప్పుకోదగ్గవి ఆర్డర్ ఆఫ్ పోల్ స్టార్ (మంగోలియా దేశపు అత్యున్నత అవార్డు), రష్యా ప్రభుత్వంచే ది పీటర్ ది గ్రేట్ అవార్డ్, సంత్ శ్రీ ధ్యానేశ్వర్ ప్రపంచ శాంతి బహుమతి (భారతదేశం), గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ (అమెరికా) మొదలైనవి. ఐక్యరాజ్యసమితిచే 2000వ సంవత్సరంలో జరుపబడిన మిలీనియం ప్రపంచ శాంతి శిఖరాగ్రసభ, 2001, 2003 సంవత్సరాలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలలోనూ, అనేక దేశాల పార్లమెంటుసభలలోనూ శ్రీశ్రీ ప్రసంగించారు..
శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించి 500 సంవత్సరాలైన సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలలో రిసెప్షన్ కమిటీ చైర్మన్ గా శ్రీశ్రీ నియమితులయ్యారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నియమించిన అమర్.నాథ్ దేవస్థానం బోర్డులోనూ శ్రీశ్రీ సభ్యులుగా ఉన్నారు.
ప్రతీయేటా సుమారు నలభైదేశాలు చుట్టివచ్చే శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవ్యాప్తజ్ఞానానికి ప్రతీక. విశ్వానికి వారిచ్చే సందేశం సార్వజనీనం, సుస్పష్టం: ప్రేమ, జ్ఞానం అనేవి విశ్వవ్యాప్తమైనవి. ద్వేషం, అశాంతి తాత్కాలికం మాత్రమే.
